మిస్టరీ మలింగ
ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు కాదు ఎక్కడ తగ్గాలో
తెలిసినోడే గొప్పోడు. ఈ డైలాగ్ లంక మిస్టరీ బౌలర్‌కు అతికినట్టు సరిపోతుంది. ఎక్కువ
వికెట్లు తీసినోడు కాదు.. ఎప్పుడు వికెట్లు తీయ్యాలో తెలిసినోడే మ్యాచ్ విన్నర్.
అతడే లసిత్ మలింగా. ఆసియా కప్‌లో శ్రీలంక-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అందుకు
సరైనా ఉదహరణ. స్లెంగా అని ముద్దుగా పిలుచుకొనే పేసర్ తన తొలి ఏడు ఓవర్లలో ఒక్క వికెట్
కూడా తీయలేదు. కానీ చివర్లో అతడు వేసిన 14 బంతులు మ్యాచ్ ఫలితాన్నే మార్చేశాయి. అతడి
మ్యాజిక్ బంతులు పాకిస్థాన్ తలరాతను మార్చేశాయి. గెలుపు వైపు దూసుకుపోతున్న గ్రీన్
టీంను దెబ్బతీశాయి…
ముందున్నది
297 పరుగుల లక్ష్యం… పాకిస్థాన్ స్కోరు 42 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి
241 పరుగులు. అలాంటి పరిస్థితుల్లో పాక్ గెలుపుపై
ఎవరికీ డౌట్ ఉండదు. చేతిలో 8 ఓవర్లు, ఆరు వికెట్లు… చెయ్యాల్సింది 56 పరుగులు…
ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే 48 బంతుల్లో
56 పరుగులు... క్రీజ్‌లో ఉన్నది పాక్ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్, ఫాంలో ఉన్న
ఉమర్ అక్మల్… ఈ జోడీ అప్పటికే 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఉమర్ అక్మల్
74, మిస్బా 67 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇక పాక్ గెలుపు నల్లేరుపై నడకే అనుకుంటున్న
సమయంలో ఉమర్ అక్మల్ ఔట్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని ముద్దాడి వికెట్ సమర్పించుకున్నాడు.
దీంతో 244 పరుగుల దగ్గర పాకిస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది. అయినా అప్పటికే పాక్
సురక్షిత స్థానంలో ఉంది. 45 బంతులకు 55 పరుగులు అవసరం.. హార్డ్ హిట్టర్ ఆఫ్రది క్రీజ్‌లోకి
వచ్చాడు. ఇంకేముందు పాక్‌దే విజయమని సగటు అభిమాని డిసైడ్ అయి ఉంటాడు. కానీ అక్కడే
మలింగా మ్యాజిక్ మొదలెట్టాడు…
ఓటమి
తప్పదనుకున్న సమయంలో ఏం చేస్తే సీన్ మారుతుందో మలింగాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో?
అప్పటి వరకు వేసిన ఓవర్లు ఒక ఎత్తైతే.. ఆ తరువాత మలింగా బౌలింగ్ ఒక ఎత్తు. ప్రతి బంతికి
వేరియేషన్ చూపించాడు. బంతి వేస్తే వికెట్
పడాల్సిందే అన్నట్టు చెలరేగిపోయాడు. 45 ఓవర్లో అద్భుతం చేశాడు. అదే ఓవర్లో ఆఫ్రిదిని,
మిస్బాను పెవిలియన్‌కు చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దీంతో 30 బంతుల్లో పాక్
43 పరుగులు చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే క్రీజ్‌లో ఉమర్ గుల్ లాంటి హిట్టర్
ఉండడంతో పాక్‌కు మ్యాచ్‌పై ఆశలు మిగిలే ఉండేవి. కానీ ఆ అశను కూడా మలింగా వమ్ము చేశాడు.
47వ ఓవర్లో ఉమర్ గుల్‌ను పెవిలియన్‌కు పంపాడు. లంక సారథి నమ్మకాన్ని మలింగా నిలబెట్టాడు.
కానీ అక్కడితో అతడికి రెస్టు దొరకలేదు.
లక్మల్
వేసిన 48వ ఓవర్లో లంక భారీ మూల్యం చెల్లించుకుంది. 18 బంతులకు 34 పరుగులు అవసరం అనుకున్న
సమయంలో శ్రీలంకవైపే విజయం మొగ్గు చూపుతున్నట్టు అనిపించింది. కానీ లక్మల్ అనుభవరాహిత్యం
ఆ జట్టు కొంపముంచేట్టు కనిపిచింది. లక్మల్ ఓవర్‌లో పాకిస్థాన్ 17 పరుగులు చేసింది.
దీంతో లంకకు విజయం కాస్త దూరమైనట్టు కనిపిచింది.
మిగిలిన 12 బంతుల్లో పాక్ విజయానికి 17 పరుగులు, లంక గెలుపుకి 2 వికెట్లు అవసరం. అలాంటి
సమయంలో 49వ ఓవర్‌ను మలింగకు అప్పచెప్పాడు కెప్టెన్ మాథ్యూస్. అంతకంటే వేరే ఆప్షన్
కూడా లేదు. కెప్టెన్ తనపై పెట్టిన నమ్మకానికి
మలింగా నిలబెట్టాడు. వేరే బౌలర్‌పై ఆదారారపడాల్సిన అవసరం లేకుండా మ్యాచ్‌ను తానే ముగించేశాడు.
49వ ఓవర్లో అజ్మల్, భట్టీలను ఔట్ చేసి.. లంకను గెలిపించాడు. తన జట్టుకు 12 పరుగుల
విజయాన్ని అందించాడు. తొలి ఏడు ఓవర్లలో వికెట్ తీయలేక పోయినా.. జట్టుకు అవసరమైన తన
సెకెండ్ స్పెల్‌లో 5 వికెట్లు తీసి దటీజ్ మలింగ అనిపించుకున్నాడు. 45వ ఓవర్లో రెండు, 49 ఓవర్లో రెండు వికెట్లు తీశాడు.
ఓవరాల్‌గా ఐదు వికెట్ల ఫీట్‌తో పాటు 250 వికెట్ల మైల్‌స్టోన్ చేరుకున్నాడు. లంక జట్టుకు
అత్యధిక విజయాలు అందించిన బౌలర్లలో మలింగా ఒక్కడు. అతడు రాణించినప్పుడు 70 శాతం మ్యాచ్‌ల్లో
శ్రీలంక విజయం సాధించింది. మలింగ గొప్పతనం చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి. అందుకే
అతడు ఎక్కువ వికెట్లు తీసే బౌలర్ కాదు.. ఎప్పుడు వికెట్లు తీయాలో తెలిసిన బౌలర్ అనాల్సి
వచ్చింది…
----------------------------------------------------------------------------------------------------------------------------------
Comments
Post a Comment