నా గురించి నేను చెప్పాలంటే… 
నేను పుట్టింది జక్కువ అనే పల్లెటూరిలో.. అమ్మ సూర్యలక్ష్మి, నాన్న విశ్వనాథన్, అన్నయ్యలు రూప సుందర్, ఈశ్వర శర్మ, తమ్ముడు సుందర్, మాదో చిన్న మారుమూల గ్రామం. నేను పుట్టేనాటికి మాకు బస్ సౌకర్యం లేదు… చిన్న బైకులు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఎక్కడికి వెళ్లాలన్నా కాళ్లకు పని చెప్పాల్సిందే. అంతెందుకు హైస్కూల్ కూడా లేదు. ఐదో క్లాస్ వరకు ఊళ్లో చదవి.. తరువాత హై స్కూల్ కోసం.. రెండు కిలోమీటర్లు నడిచి వెళ్తూ ఉంటే మహా సరదాగా ఉండేంది. ఆ నడకే ఇప్పుడు కాస్త ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతోందేమో?..
జీవితం ఎంత ఎత్తుకు ఎదిగినా… ఎక్కడ పెరిగినా ఆ చిన్న నాటి జ్ఞాపకాలు ఎప్పటికీ తియ్యగా వెంటాడుతూనే ఉంటాయి. ప్రతి రోజు దాదాపు రెండు వైపులా కలసి గంటకు పైగా నడిచే వాళ్లం. అయినా ఎప్పుడు కాళ్లు నొప్పి.. అలసట అనే మాటే ఎరుగం.. మధ్యమధ్యలో పచ్చి టమోటాలు.. పెసరకాయలు.. ఉల్లి కాడలు.. చింతకాయలు.. మామిడి కాయలు.. తాటికాయలు ఇలా ఒకటేంటి.. ఎన్నో స్నాక్స్ అన్ని న్యాచురల్ ఫుడ్స్… జంగ్ఫుడ్ ఊసే తెలియదు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే…. అమ్మ… అప్యాయంగా ఆకలేస్తోందా అంటూ ఏదో ఒకటి తినిపించే ప్రయత్నం చేస్తుంటే.. ఆ రోజుల్లో తెలియలేదు నా కడుపు బాధ అమ్మకు ఎలా తెలిసిందని. అలా తెలుసుకుంటుంది కాబట్టే ఆమె అమ్మ అయ్యందని చాలా లేటుగా తెలిసింది. సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్.. రోజు క్యారేజీ పట్టుకెళ్లడం.. అక్కడ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం… శనివారం అందరూ టిఫెన్లు మాత్రమే తీసుకెళ్లడం.. ఇంటర్వెల్ బెల్ మోగిందంటే చాలు.. స్కూల్ దగ్గర చక్కీలు అమ్మే వాడి దగ్గరో… పుల్ల ఐసు వాడి దగ్గరో వాలిపోవాడం. ఇలా అన్నీ స్వీట్ మెమొరీస్నే. ఇక ఆదివారం వచ్చిందంటే రాత్రి వరకు ఇంటికి గుడ్ బై చెప్పేయడమే… ఉదయం క్రికెట్.. సాయంత్రం వరకు తోటల్లో పచార్లు… ఫ్రెండ్స్తో ఆటలు.. చిన్న నాటి స్కూల్ దగ్గర ముచ్చట్లు.. ఇలానే రోజంతా గడిచిపోయేది.
ఇక ఇంటర్కు పల్లెటూరు వీడి.. వైజాగ్ అనే మహాసముద్రంలో పడ్డాను. విశాఖపట్నం వెళ్తే బాగా చదువుకోవచ్చు అని అందరూ సలహా ఇచ్చారు. వెళ్లాక తెలిసింది. చదువు సంకనాకిపోవడం గ్యారెంటి అని?.. అలా అందరికీ అవుతుందని చెప్పలేం. కానీ సిటీ లైఫ్కు అలవాటు పడి.. కాలేజీకు… బుక్స్కు.. కాస్త రెస్టిస్తే.. ఎవరి ఎడ్యుకేషన్ అయినా ఏమవుతుంది. అదే జరిగింది. క్లాస్లకు బంక్లు సినిమా థియాటర్లలో చిందులు… పార్కులు.. బీచులు.. ఇలా కాలేజ్ రోజులు హ్యాపీడేస్గా సాగిపోయాయి. మా నాన్న ఇచ్చిన చనువు ఇంకెవరికి ఆ రోజుల్లో దొరకదేమో అనిపించేంది. నా పుట్టిన రోజుకు మా నాన్న గారు నా ఫ్రెండ్స్ అందరినీ సినిమాకు తీసుకెల్లారు. నేను అడగకుండానే నా సరదాలు తీర్చారు. అలాంటి తండ్రి కావాలని ఎవరు కోరుకోరు.
ఇలా ఇంటర్ నుంచి డిగ్రీ వరకు విరామం లేని ఎంజాయ్మెంట్. క్లాస్కు వెళ్లడం అంటూ జరిగితే అది కేవలం క్లాస్లో ఉండే అమ్మాయిల కోసమే.. అలా టైం పాస్ చేస్తున్నప్పుడు తెలియలేదు. చదువ విలువు ఏంటో? అసలు ఆ సమయంలో ఏం మిస్సయ్యామో అన్నది… అయితే అమ్మ దీవెనులు అండంగా ఉండడంతో మనసు చెడు దారులు తొక్కలేదు. అందులోనే నేను పెరిగింది.. పిన్నీ.. చిన్నాన్నల ఇంట్లో. కానీ ఎప్పుడు ఆ ఫీలింగ్ లేదు. సొంత అమ్మానాన్నలకంటే ఎక్కువగా వాళ్లు చూసుకున్నారు. చిన్నాన్న, పిన్ని అంటే భయం లేకున్నా.. గౌరవం మాత్రం పెరిగింది. అందుకే కాస్త ఏదైనా తప్పు చెయ్యాలనే ధ్యాసే లేకుండా పోయింది…
తరువాత నన్ను వెనుకుండి ప్రోత్సహించింది అన్నయ్యలు… తమ్ముడు మాత్రమే. పీజీలో జాయిన్ అయ్యినదగ్గర నుంచి ఎప్పుడు ఎంత డబ్బులు అడిగినా నో అనకుండా.. నా ఎంజాయ్మెంట్కు పూర్తి స్వేచ్చ నిచ్చారు. ఎప్పుడు లేటుగా వచ్చినా.. ఎందుకు లేటు.. ఎక్కడికి వెళ్లాం అనే ప్రశ్నలు లేవు. ఎందుకంటే వాళ్లకు నామీద ఉన్న నమ్మకం అలాంటింది. వారి నమ్మకం నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతో కాస్త చెడు అలవాట్ల జోలికి పోలేకపోయాను. అందుకే నా ముగ్గురు బ్రదర్స్ అంటే నాకు ఎనలేని గౌరవం…
పిజీ వరకు నా లైఫ్ స్టైలే వేరు… బాధ్యతల ఊసులు లేదు. కావాల్సిందంతా ఎంజాయ్మెంట్. ఇదే సూత్రంతో కాలేజ్ లైఫ్ను మూడు సినిమాలు.. ఆరు షికార్లు అంటూ గడిపేశాను. తరువాతే లైఫ్లో అసలైన మార్పు. ఉద్యోగ వేటలో భాగంగా హైదరాబాద్లో అడుగుపెట్టాను. ఉద్యోగ వేటలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురైనా.. చివరికి నా కుటుంబ సభ్యుల సహకారం.. ఫ్రెండ్స్ తోడ్పాటుతో సక్సెస్ అయ్యాను. హైదరాబాద్ వచ్చాక నాలో అసలైన మార్పు ఏదైనా ఉందా అంటే… ఒళ్లు పెంచడం అని చెప్పొచ్చు. వైజాగ్లో నా వెయిట్ 50 దగ్గర్లో ఉండేది. ఇప్పుడు 80 కోసం పోటీ పడుతోంది. అంటే నా ఫుడ్ హ్యాబిట్స్ ఎంతలా మారాయో అని అప్పుడప్పుడూ బాధ పడడం తప్పా ఏం చెయ్యలేకపోతున్నా. తగ్గే ప్రయత్నం చెద్దాం అనుకోవడమే తప్ప ఆచరణలో పెట్టేందుకూ బద్దకం వెంటాడుతోంది…
హైదరాబాద్ వచ్చాక జాబ్లు అయితే మారాను కానీ లైఫ్లో పెళ్లి కాకముందే సెటిల్ అవ్వాలన్న విషయాన్ని గ్రహించలేకపోయాను. ఇక ఎప్పటికీ మారలేనేమో అనుకుంటున్న నాకు… నన్ను అర్థం చేసుకొనే అర్థాంగి దొరికింది. సో ఇప్పుడు వెరీ హ్యాపీ…
ఇప్పటికే ఎక్కువ చెప్పి బోర్ కొట్టించి ఉంటా.. ఇంకా తెలుసుకోవాల్సింది కూడా ఏమీ లేదు లెండి.
నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబ సభ్యులు
...
భార్య సుమ,అన్నయ్యలు సుందర్రావు, శర్మ, తమ్ముడు బుజ్జి, చిన్నాన్న, పిన్ని... శ్రీదర్ బావ.. లావణ్య... వారందరి సహకారంతో లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతోంది..
hey na life lo ithe ela assalu okkati kuda jaragaledhu kani ma dadi nd ma mom cheppevallu memu chala dhuram nadichi vellevallam chaduvkodaniki ani....bt nuv chepthunte malli naku ma parents cheppinavi gurthuvasthunnai naku bt me life lo jariginavi anni marchipoleru meru dats great...ma time ki atuvantivi am levu anni facilities unnai maku ithe...its really superb yar... :) <3
ReplyDelete