అర్థమవుతోందా..?

ఓయ్‌ అర్థమవుతోందా..? 


మీరేమైనా తోపులా..? మీకు మాత్రమే పనులు ఉన్నాయా..? ఇంట్లో ఉండండి.. పిల్లలతో ఆడుకోండి.. కుటుంబంతో గడపండి.. కాళ్లపై కాళ్లు వేసుకొని టీవీ చూడండి.. పనులన్నీ పక్కన పెట్టి కాలక్షేపం చేయండి.. ఇళ్లే మీకు శ్రీరామ రక్ష అని చెబుతుంతే చెవికి ఎక్కడం లేదా..? ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు ప్రకటించినా మీకు పట్టదా..? ప్రపంచం మునిగిపోయేట్టు.. భూమి బద్దలయ్యేట్టు.. మీకు మాత్రమే పనులు ఉన్నట్టు ఇలా రోడ్లపైకి వచ్చేస్తున్నారు.. గుంపులు గుంపులుగా షికార్లు చేస్తున్నారు.. కొంచమైనా ఆలోచించరా..? అసలు బుద్ధీ జ్ఞానం ఉందా..? కరోనా అంటే సునామీ కాదు.. భూకంపం కాదు.. ప్రకృతి ప్రకోపం కాదు.. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఉత్పాతం.. ఊహకు అందని ప్రమాదం.. నిర్లక్ష్యంగా ఉంటే తప్పదు భారీ మూల్యం.. బీ కేర్‌ ఫుల్‌..


మీ ప్రాణాల కోసం వైద్యులు వారి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.. మీకు రక్షణ కవచంగా నిలిచేందుకు పోలీసులు ఎండని.. తిండిని లెక్క చేయక రోడ్లపై చెమటలు కక్కుతున్నారు..? పారిశుధ్య కార్మికులు.. అధికారులు, ప్రభుత్వం.. ఒక్కరేంటి ఇలా.. ఎందరో మీకు సంబంధం లేని వాళ్లు.. ఒకరికి ఒకరు ఏమీ కాని వారు.. మీ అందరికీ బంధువుల్లా.. దేవుడు పంపిన సైనికుల్లా కరోనాపై  యుద్ధం చేస్తున్నారు. ప్రాణాలపైకి వస్తుందని తెలిసినా.. వెనకడుగు వేయడం లేదు.. మా కెందుకులే ఈ ప్రమాదం అని పారిపోవడం లేదు.. ఎవరికి కోసం వారు ఇదంతా చేస్తున్నారు..? ఏం మీకే కుటుంబాలు.. సంతోషాలు.. సరదాలు ఉన్నాయా..? వాళ్లకి లేవా కుటుంబాలు..? వాళ్లవి మాత్రం కాదా ప్రాణాలు..?  

అయినా నా ఇష్టం నేను రోడ్లపైనే తిరుగుతాను అంటే.. కరోనా కాచుకొని ఉంది చూసుకో..  కోరాలు చాచుతూ కాటేస్తుంది జాగ్రత్త.. మొదట నీకు.. నీ కారణంగా నీ కుటుంబానికి.. నీ కాలనీకి.. నీ ఊరికి.. నీ రాష్ట్రానికి.. నీ దేశానికి వైరస్‌ విస్తరిస్తుంది. నువ్వు ఈ వారం రోజులు రోడ్డుమీదకు రాకపోతే దేశమేమైనా ఆగిపోతుందా..? ప్రాణం కంటే మించింది ఏదీ లేదు..? తెలివైనవాడు ప్రాణాలమీదకు వచ్చేంత వరకు ఆగడు.. పక్కవాడి ప్రాణాలపైకి వచ్చినప్పుడే అలర్ట్‌ అవుతాడు..? దేశమంటే మట్టి కాదు.. మనుషులం.. మనమంతా మనుషులం ఆ మాట గుర్తుంచుకో..? అలా గుర్తించకే ఇటలీ ఇప్పుడు శవాల గుట్టైంది.. మనం కూడా అలాగే బాధ్యతారాహిత్యంగా తిరిగేద్దామా..? కరోనాని కట్టడి చేద్దామా..?  అందుకే  అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రాకు.. నీ ఒక్కరి నిర్లక్ష్యం.. ఎందరో ప్రాణాలపైకి తెస్తుంది.. కచ్చితంగా ఇంటి దగ్గరే ఉండి కరోనాను ఓడించడానికి మేము సైతం అంటూ సైనికుడిగా మారు.. అర్థమవుతోందా..? 

Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..