నేటి బాలలే రేపటి పౌరులు
హ్యాపీ చిల్డ్రన్స్ డే
ఈ రోజు బాలల దినోత్సవం. ప్రతి ఏడాది నెహ్రూ జన్మదినోత్సవాన్ని ఘనంగానే జరుపుకుంటున్నాం. చాచాజీ జేబులో ఓ గుళాబి పువ్వు. చుట్టూ
చేరి ఉన్న చిన్నారులు. ఈ ఫోటో చూస్తే మనకు స్వచ్ఛమైన
రూపం కనిపిస్తోంది. ఖచ్చితంగా బాలల దినోత్సవం జరుపుకోవాలని
ఆశ కలుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లవుతున్నా. మన దేశంలో చిన్నారుల భవిష్యత్తుకు మాత్రం భద్రత లేదు. దేశంలో అందరికంటే అత్యధికంగా నరక యాతన అనుభవిస్తున్నది చిన్నారులు
మాత్రమే. లైంగిక దాడులు. కిడ్నాపులు. చైల్డ్ లేబరింగ్. ట్రాఫికింగ్. ఇలా ఒక్కటేంటే. చాలామంది చిన్నారులు నేటి సమాజంలో నరక యాతన అనుభవిస్తున్నారు.
మళ్లీ బాల్యం వస్తే ఎంత బాగుటుందో.. దాదాపు ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా ఈ మాట అనుకోవడం
కామన్. ముఖ్యంగా బుడి బుడి అడుగుల చిన్నారులను.. ముద్దులొలొకే బాల బాలికలను చూసినప్పుడు మనసులో చిన్న నాటి
ఊహలు గుసుగుసలాడుతూనే ఉంటాయి. నిజమే బాల్యం అన్నది ఓ అందమైన
అనుభవం. ఆటపాటలతో ఖుషీ ఖుషీగా సాగిపోయిన బాల్యం మళ్లీ
మళ్లీ వస్తే అంతకుమించిన అదృష్టం మరొకటి వుండదు. కానీ
ఇవాళ్టి బాల్యం మళ్లీ ఆహ్వానించేలా లేదు. ఎటు చూసినా
అన్నీ సమస్యలే. నేటి బాలలు చాలా మంది మాధుర్యానికి, సంతోషాలకు దూరంగా ఉంటున్నారు.
బాల్యమంటే ఆడుతూ పాడుతూ, చదువలమ్మ ఒడిలో కేరింతలు కొడుతూ చదువుకోవాల్సిన వయస్సు. కానీ మన దేశంలో పిల్లలందరికీ చదువుకునే భాగ్యం లభించడం లేదు. గత జనభా లెక్కల ప్రకారం మన దేశంలో 25 కోట్ల మంది పిల్లలుంటే అందులో కోటీ 26 లక్షల మంది బాల కార్మికులుగా జీవితాలు వెళ్లదీస్తున్నారు. 12 లక్షల మందికిపైగా ప్రమాదకర వృత్తుల్లో ప్రాణాలు
అరచేతపట్టుకుని పొట్టపోసుకుంటున్నారు. చిట్టి
చిట్టి చేతుల చిన్నారులు బండ చాకిరీ చేయాల్సిన పరిస్థితి దాపురించింది.
శిశువుగా కళ్లు తెరిచిన నాటి నుంచి చిన్నార్లు
అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య
చిన్నారులపై దాడులు సర్వ సాధరణామై పోయాయి. పెద్దలు
తమ మధ్య ఉన్న కక్షలకు పిల్లల్ని బలి పశువులు చేస్తున్నారు. అక్రమార్జన
కోసం కిడ్నాపులు చేస్తున్నారు... పిల్లల్ని భయభ్రాంతులకు గురి
చేస్తున్నారు. క్రమశిక్షణతో పాటు విద్యాబుద్ధులు
నేర్పాల్సిన పాఠశాలల్లో పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. అపన్నహస్తం
ఇవ్వాల్సిన కొందరు అత్యాచారాలకు
పాల్పడుతున్నారు. బాల్యాన్ని మంట గలుపుతున్నారు.
నేటి సమాజంలో మృగాళ్లు... పెరిగిపోతున్నారు. వారంతా
ఆధునికత వదిలి అనాగరికత వైపు అడుగులు వేస్తున్నారు. ఆటవిక
పయనం సాగిస్తున్నారు. ముక్కు పచ్చలారని చిన్నారుల్ని
కబంధ హస్తాల్లో నలిపేస్తున్నారు. ఆడుతూ పాడుతూ లోకం పోకడ తెలియని
పిల్లలను కన్ను మిన్నూ కానక కసితీరా చిదిమేస్తున్నారు. అడుగడుగునా
ఆరాచకం ... వీధి వీధినా వినాశనం సృష్టిస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల కల్లలు.. కల్లలైపోతున్నాయి.
అనాధ బాల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులపై సమాజంలో నానాటికీ లైంగిక
దాడులు పెరుగుతున్నాయి. అనాధలతో వెట్టి చాకిరీ చేయించే
వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అమ్మ ఒడిలో
పెరగాల్సిన చిన్నారులను ఆదుకోవాల్సిన సమయంలో కొంతమంది తమ స్వార్థం కోసం... బాల కార్మికులుగా మార్చేస్తున్నారు. లేదా భిక్షాటనకు పంపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు
రూపు మాపినప్పుడు అసలైన బాలల దినోత్సవానికి అర్థం చేకూరుతుంది. నెహ్రూ కన్న కలలు నిజమవుతాయి. నేటి
బాలలు రేపటి పౌరులుగా అభివృద్ధి చెందుతారు.
Comments
Post a Comment